ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్.. పర్పుల్, ఆరెంజ్ క్యాప్‌లు ఎవరికంటే..?

 


2024 ఐపీఎల్ సీజన్ విజేతగా కోల్‌కతా నైట్‌ రైడర్ నిలిచింది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో పాట్ కమ్మిన్స్ (24) ఒక్కడే టాప్ స్కోరర్ .. మిగిలిన వారంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేసింది. వెంకటేష్ అయ్యర్ 52, గుర్బాజ్ 39 పరుగులు చేసి జట్టుకు కప్‌ను అందించారు. హైదరాబాద్ బౌలర్లలో కమ్మిన్స్ , షబాజ్ అహ్మద్‌లు తలో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నైట్ రైడర్స్ ధాటికి ఈ టోర్నీ మొత్తం భీకర ఫాంలో ఉన్న ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), హెడ్ (0), రాహుల్ త్రిపాఠి (9)లు విఫలమయ్యారు. మార్‌క్రమ్ (20), నితీష్ రెడ్డి (13)లు ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. క్రీజులో  నిలదొక్కుకుంటున్నట్లు కనిపించిన ఈ జంటను హర్షిత్ విడగొట్టాడు. తర్వాత క్లాసెన్ (16), షాబాజ్ అహ్మద్ (8), అబ్ధుల్ సమద్ (4), కమ్మిన్స్ (24), జయదేవ్ ఉన్కదత్ (4)లు ఇలా వచ్చి అలా వెళ్లారు. కమ్మిన్స్ పోరాటంతో సన్‌రైజర్స్ ఆ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో రస్సెల్ 3, స్టార్క్ , హర్షిత్ రాణాలు తలో రెండు వికెట్లు.. వైభవ్ అరోరా , నరైన్ , చక్రవర్తిలు తలో వికెట్ పడగొట్టారు. 

ఇకపోతే.. ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ విషయానికి వస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో జట్లు టైటిల్ గెలవడం వల్ల కప్పు టీం దగ్గరే ఉండిపోతుంది కానీ సొమ్ము మాత్రం ఆటగాళ్లకే చెందుతుంది. ఐపీఎల్ సీజన్ 17లో టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ.20 కోట్లను బహుమతిగా ఇచ్చారు. రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.13 కోట్లను అందజేశారు. అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీకి (741) ఆరంజ్ క్యాప్ కింద రూ.10 లక్షలు ప్రదానం చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్‌ (24) అత్యధిక వికెట్లు తీస పర్పుల్ క్యాప్ కింద రూ.10 లక్షలు ఇచ్చారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కింద నితీష్ కుమార్ రెడ్డికి రూ.10 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద సునీల్ నరైన్ 10 లక్షలు దక్కించుకున్నాడు. 


Comments